20 October 2015

వ్యాయామంతో జబ్బులు రావా?





ప్రశ్న: క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి ఏ జబ్బులూ రాకుండా ఉంటాయా?


జవాబు: వ్యాయామం మాత్రమే చేసి సరియైన ఆహారం తీసుకోకుండా ఉన్నా, పొగ, మద్యపానం, అపరిశుభ్రమైన నీరు తాగినా జబ్బులు రాకమానవు. వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా చేస్తే మరీ మంచిది.  వ్యాయామంతో పాటు మంచి అలవాట్లూ ఎంతో ముఖ్యం. సరియైన శారీరక శ్రమ లేనివారు వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి కండరాల పనితీరు తొందరగా తగ్గి, వృద్ధాప్యం రావడమే కాకుండా వూబకాయం వస్తుంది. క్రమం తప్పని వ్యాయామం సామాజిక సేవ కాదు, ఎవరికో మేలు చేయడం కాదు. తనకు తాను చేసుకునే అత్యంత గొప్ప మేలు. ఇది సద్గుణం.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌,-శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

30 September 2015

Cognetive behaviour therapy for sleep(కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ)-నిద్రకి మాటల చికిత్స

  •  

  • Cognetive behaviour therapy for sleep(కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ)-నిద్రకి మాటల చికిత్స

ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. దీంతో రోజువారీ పనులతో తలెత్తిన అలసట, బడలిక తొలగిపోయి కొత్త ఉత్సాహం వస్తుంది. మన శరీరం కూడా నిద్రపోతున్న సమయంలోనే మరమ్మతు చేసుకుంటుంది. అయితే కొందరికి ఒక పట్టాన నిద్రపట్టదు. రాత్రంతా ఎప్పుడు చూసినా మెలకువగా ఉన్నట్టే అనిపిస్తుంటుంది. నిజానికిది పెద్ద సమస్య. ఎందుకంటే నిద్రలేమితో ఏకాగ్రత తగ్గటం, మతిమరుపు వంటివే కాదు.. ఆందోళన, కుంగుబాటు, మధుమేహం వంటి ఇతరత్రా సమస్యల ముప్పూ పొంచి ఉంటుంది. సాధారణంగా నిద్రలేమి దీర్ఘకాలంగా వేధిస్తుంటే డాక్టర్లు నిద్ర మాత్రల వంటివి సిఫారసు చేస్తుంటారు. వీటితో సమస్య తగ్గుతుంది కానీ.. కొన్ని దుష్ప్రభావాలు, మాత్రలకు అలవాటు పడటం వంటి ఇబ్బందులూ ఉంటాయి. అందువల్ల వీరికి ముందుగానే మాత్రలు, మందులు ఇవ్వటం కన్నా కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీని ప్రయత్నించటం మేలని, దీంతో మంచి ఫలితం కనబడుతోందని పరిశోధకులు చెబుతున్నారు. కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ అనేది ఒకరకంగా మాటల చికిత్స అనుకోవచ్చు. ఇందులో మన ఆలోచనా పద్ధతులు మారేలా, ఆయా పరిస్థితులకు అనుగుణంగా స్పందించేలా నిపుణులు కౌన్సెలింగ్‌ ద్వారా నేర్పిస్తారు. ఇలాంటి చికిత్సతో 20 నిమిషాల ముందుగానే కాదు.. 30 నిమిషాల సేపు అధికంగానూ నిద్రపోతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఈ చికిత్స ప్రభావాలు మున్ముందూ కొనసాగుతున్నాయని.. లక్షణాల్లోనూ, హాయిగా ఉన్నామనే భావనలోనూ మెరుగుదల కనిపిస్తోందని అధ్యయన నేత, ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్‌ జేమ్స్‌ ట్రాయెర్‌ చెబుతున్నారు. నిద్రలేమిపై గల చెడు ఆలోచనలను, ఆందోళనను తగ్గించటం.. ఒకే సమయానికి నిద్రించేలా చూడటం.. శరీరానికి, మనసుకు విశ్రాంతినిచ్చే పద్ధతులను నేర్పించటం.. ఇవన్నీ కలిసి బాగా పనిచేస్తున్నాయని వివరిస్తున్నారు.


12 August 2015

Nasal spray vaccine for flu-శిశువులు-వృద్ధులకు త్వరలోనే నాసికా ఫ్లూ టీకా

  •  
  •  

Nasal spray vaccine for flu-శిశువులు-వృద్ధులకు త్వరలోనే నాసికా ఫ్లూ టీకా

వాషింగ్టన్‌: రెండేళ్లలోపు చిన్నారులు, 49 ఏళ్లు పైబడినవారికీ ఉపయోగపడేలా ముక్కు ద్వారా పిచికారి చేసే ఫ్లూ టీకాను రూపొందించే పద్ధతిని పరిశోధకులు అభివృద్ధి పరిచారు. మానవ నాసిక, సైనస్‌ మార్గాల్లోని కణాల్లో బలహీనపడిన ఫ్లూ వైరస్‌ను ఉపయోగించి పరిశోధన చేపట్టారు. వయసు పెరుగుతున్నకొద్దీ ఫ్లూటీకాల ప్రభావం తగ్గిపోయే వృద్ధుల కోసం మెరుగైన టీకాల్ని తయారు చేయగలగడం ఉత్తేజాన్నిస్తోందని జాన్స్‌హాప్కిన్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్‌ పరిశోధకులు ఆండ్రూపెకోస్జ్‌ పేర్కొన్నారు. ఆరు నెలల నుంచి రెండేళ్ల చిన్నారులకు ఇంజక్షన్‌ టీకాలు ఇస్తున్నా, నాసికా స్ప్రే ద్వారా ఇచ్చే టీకా మరింత మెరుగ్గా పనిచేస్తూ, రక్షణ కల్పిస్తుందని వివరించారు. తమ పరిశోధనల ఆధారంగా మరింత మెరుగైన టీకాను రూపొందించేందుకు ఫ్లూమిస్ట్‌ టీకా తయారుచేసిన సంస్థతో ఆండ్రూ బృందం జతకట్టింది. అంతాసవ్యంగా సాగితే ఆరు నుంచి 12 నెలల వ్యవధిలో చిన్నారులు, వృద్ధులకు కొత్త టీకా అందుబాటులోకి వస్తుందని ఆండ్రూ పేర్కొన్నారు.

26 July 2015

Radiation with cell phones-సెల్‌ఫోన్‌ రేడియోధార్మికతతో ముప్పు





లండన్‌: సెల్‌ఫోన్‌ వంటి వైర్‌లెస్‌ పరికరాల్నించి వెలువడే రేడియో ధార్మికత జీవక్రియల్లో అసమతుల్యతకు తద్వారా క్యాన్సర్‌, నాడీసంబంధవ్యాధులకు కారణమవుతుందని ఒక పరిశోధన వెల్లడించింది. జీవకణాలపై తక్కువస్థాయి రేడియో ధార్మికత ఎటువంటి ప్రభావం చూపుతుందన్నదానిపై శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. దీంట్లో పాల్గొన్న డాక్టర్‌ ఐగోర్‌ యకిమెంకో మాట్లాడుతూ.. ''దీర్ఘకాలంపాటు రేడియోధార్మికతకు గురైనప్పుడు కణాల్లో ఆక్సీకరణకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. ఫలితంగా జీవక్రియల్లో అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల క్యాన్సర్‌,చర్మసంబంధ వ్యాధులు, నాడీసంబంధమైన జబ్బులు తలెత్తుతున్నట్లు అధ్యయనంలో తెలిసింది'' అని చెప్పారు

25 July 2015

First malaria vaccine-తొలి మలేరియా టీకా


  •  
  •  
ఈఎంఏ సానుకూల అభిప్రాయం--ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమతే తరువాయి
లండన్‌/జెనీవా: ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా టీకా 'మాస్‌క్విరిక్స్‌' తుది అడ్డంకులను అధిగమించింది. యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ (ఈఎంఏ) శుక్రవారం దీనిపై సానుకూలంగా శాస్త్రీయ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఇక దీనికి ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమతిస్తే చాలు. త్వరలోనే ఆఫ్రికా అంతటా ఇవ్వటం ఆరంభమవుతుంది. 30 సంవత్సరాల పరిశోధన తర్వాత రూపొందిన మాస్‌క్విరిక్స్‌కు లండన్‌లోని ఈఎంఏ పచ్చజెండా వూపింది. దీనిని ప్రపంచ ఆరోగ్యసంస్థ పరీక్షించి వచ్చే నవంబరులో తన సిఫారసులను వెలువరించనుంది. ఒకవేళ ఈ టీకాకు అనుమతి లభిస్తే వచ్చే ఐదేళ్లలో ఆఫ్రికా దేశాల్లోని పిల్లలకు ఇవ్వనున్నారు. ''ఇది గొప్ప ముందడుగు. మలేరియా టీకాపై ఈఎంఏ సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేయటాన్ని స్వాగతిస్తున్నాం. ఇది అభిప్రాయం మాత్రమే. అనుమతి కాదు'' అని ప్రపంచ ఆరోగ్యసంస్థలో బర్డ్‌ఫ్లూ, ఇతర మహమ్మారి జబ్బుల విభాగం అధికార ప్రతినిధి గ్రెగరీ హార్ట్‌ల్‌ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దీనికి గల సాధ్యాసాధ్యాలు, చవకగా అందుబాటులో ఉంచటం వంటి వాటిపై సమీక్షించనున్నామని వివరించారు. మలేరియా టీకాపై ఈఎంఏ సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేయటంపై గ్లాక్సోస్మిత్‌క్త్లెన్‌ కంపెనీకి తూర్పు ఆఫ్రికాలో ఉపాధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న అలన్‌ పంబా హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. మాస్‌క్విరిక్స్‌ టీకా రూపకల్పన కోసం గ్లాక్సోస్మిత్‌క్త్లెన్‌ కంపెనీ ఇప్పటివరకు సుమారు రూ.23 వేల కోట్లు (35.6 కోట్ల డాలర్లు) ఖర్చు చేసింది. మలేరియాకు టీకాలను రూపొందించటానికి పరిశోధకులతో పాటు పలు మందుల కంపెనీలు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాయి. కొన్నింటిని తయారుచేసినప్పటికీ అవి ప్రయోగ పరీక్షల్లో విఫలమయ్యాయి. ఇది గొప్ప విజయమని, కానీ ఇంకా పని పూర్తికాలేదని హార్ట్‌ల్‌ పేర్కొన్నారు. ఇప్పుడు తమ పని మొదలవుతుందన్నారు. గ్లాక్సోస్మిత్‌క్త్లెన్‌, పాత్‌ మలేరియా వ్యాక్సిన్‌ ఇనీషియేటివ్‌ భాగస్వామ్యంతో ఏడు దేశాల్లోని 11 పరిశోధన కేంద్రాల్లో ఈ టీకా ప్రయోగ పరీక్షలను నిర్వహించారు. అయితే ఇది ఇతర రోగనిరోధక కార్యక్రమాల కన్నా తక్కువ స్థాయిలోనే రక్షణ కల్పిస్తున్నట్టు బయటపడింది. టీకాను తీసుకున్న నాలుగేళ్ల తర్వాత దీని రక్షణ ప్రభావం 36% వరకు పడిపోతున్నట్టు తేలింది. తుది అనుమతి ఇచ్చేముందు ఇలాంటి విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని ప్రపంచ ఆరోగ్యసంస్థ అధికారి ఒకరు తెలిపారు.

Glucoma medicine helps to treat resistence TB-మొండి క్షయకు నీటికాసుల మందు

  •  

  •  
నీటికాసుల (గ్లకోమా) చికిత్సలో వాడే ఎథాగ్జోలమైడ్‌ మందు క్షయను నిలువరించటానికీ తోడ్పడుతున్నట్టు మిచిగన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయం (ఎంఎస్‌యూ) పరిశోధకులు గుర్తించారు. ఇది రోగనిరోధక వ్యవస్థలోకి క్షయ చొరబడే సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తుండటం గమనార్హం. ''క్షయ కారక బ్యాక్టీరియా రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని తెల్ల రక్త కణాల్లో వృద్ధి చెందటానికి అవసరమైన సామర్థ్యాన్ని ఎథాగ్జోలమైడ్‌ పూర్తిగా తగ్గిస్తోంది'' అని ఎంఎస్‌యూ శాస్త్రవేత్త రాబర్ట్‌ అబ్రామోవిచ్‌ తెలిపారు. శరీరంలో ఆమ్ల స్థాయుల వంటి అనువైన పరిస్థితులను పసిగడుతూ క్షయ కారక బ్యాక్టీరియా వాటికి అనుగుణంగా మారుతుంది. ఈ సామర్థ్యాన్ని ఎథాగ్జోలమైడ్‌ నిలువరిస్తున్నట్టు గుర్తించామని అబ్రామోవిచ్‌ పేర్కొన్నారు. ఇది క్షయ వ్యాప్తిని నివారించటానికే కాదు. చికిత్స సమయాన్ని తగ్గించటానికి, క్షయ కారక క్రిమి మందులను తట్టుకునేలా మారటాన్ని ఆలస్యం చేయటానికీ తోడ్పడగలదన్నారు. ఈ మందు ఎలుకల్లో క్షయ లక్షణాలను తగ్గించినట్టు గుర్తించామని తెలిపారు.

Root of over-eating is in brain!-అతి తిండికి మూలం మెదడులో!

  •  

  •  
కొందరు కేవలం ఆనందం కోసమే అతిగా తింటుంటారు. దీనికి గ్లుకాగోన్‌ తరహా పెప్త్టెడ్‌-1 (జీఎల్‌పీ-1) హార్మోన్‌ మెదడులో లేకపోవటం పాక్షికంగా కారణమవుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. ఇది వూబకాయానికి తక్కువ దుష్ప్రభావాలతో ప్రత్యేకమైన చికిత్సలను రూపొందించటానికి దారితీయగలదని ఆశిస్తున్నారు. కేంద్ర నాడీవ్యవస్థలో జీఎల్‌పీ-1 హార్మోన్‌ తగ్గినపుడు అతిగా.. అదీ ఎక్కువ కొవ్వుతో కూడిన ఆహారాన్ని తినటానికి దారితీస్తున్నట్టు రాబర్ట్‌ వుడ్‌ జాన్సన్స్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు గుర్తించారు. ఎలుకల మెదడులో జీఎల్‌పీ-1 హార్మోన్‌ సంకేతాలను ప్రేరేపించగా అధిక కొవ్వు పదార్థాలను ఎంచుకోవటం ఆగిపోయిందని సహ అధ్యయన కర్త విన్సెంట్‌ మిరాబెల్లా తెలిపారు. అమైనో ఆమ్లాల అమరికతో కూడిన జీఎల్‌పీ-1 పెప్త్టెడ్లు మన ఆహార అలవాట్లను నియంత్రించటం వంటి రకరకాల పనుల్లో పాలు పంచుకుంటాయి. చిన్న పేగులు, మెదడులోని కణాల నుంచి పుట్టుకొచ్చే ఇవి భోజనం చేస్తున్నప్పుడు కడుపు నిండిందనే విషయాన్ని మెదడుకు చేరవేస్తాయి. నిజానికి అతిగా తినటానికి ఇవొక్కటే కారణం కాకపోయినప్పటికీ.. మెదడులో మెసోలింబిక్‌ డొపమైన్‌ వ్యవస్థలోని నాడీ కణాలపై మాత్రమే పనిచేసే చికిత్సలతో అతిగా తినటాన్ని నియంత్రించొచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది. తక్కువ దుష్ప్రభావాలతో వూబకాయానికి చికిత్స చేసే అవకాశముందని పరిశోధకులు భావిస్తున్నారు

29 May 2015

skin allergic probles with Tatoo marks,పచ్చబొట్టుతో చర్మ సమస్యల ముప్పు!






skin allergic probles with Tatoo marks,పచ్చబొట్టుతో చర్మ సమస్యల ముప్పు!
న్యూయార్క్‌: పచ్చబొట్టుతో దద్దు, వాపు వంటివి తలెత్తొచ్చని.. ఇవి దీర్ఘకాలం వేధించే అవకాశముందని తాజా అధ్యయనం హెచ్చరించింది. వీటికి లేజర్‌ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరమూ ఉండొచ్చని పేర్కొంది. పచ్చబొట్టు వేయించుకున్నవారిలో సుమారు 6% మందికి దద్దు, తీవ్రమైన దురద లేదా వాపు వంటి సమస్యలు ఎదురవుతున్నట్టు ఎన్‌వైయూ ల్యాంగోన్‌ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు గుర్తించారు. పచ్చబొట్టు ప్రభావాలు నాలుగు నెలల నుంచి నాలుగేళ్ల పాటు కొనసాగుతుండటం గమనార్హం. పచ్చబొట్టు వేయించుకోవటానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దీని మూలంగా తలెత్తే ముప్పులపైనా వైద్యులు, ప్రజారోగ్య అధికారులు, వినియోగదారులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందని అధ్యయన నేత మేరీ లెగెర్‌ తెలిపారు. కొన్ని చర్మ రియాక్షన్లను స్టీరాయిడ్‌ మందులతో నయం చేయొచ్చని, కానీ మరికొన్నింటికి లేజర్‌ శస్త్రచికిత్స అవసరమవుతుందని వివరించారు

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

Blood sugar detecting chip,రక్తంలో గ్లూకోజును గుర్తించే బయో చిప్‌ సృష్టి




జెనీవా: శరీర ఉష్ణోగ్రత, ఆమ్ల స్థాయులతో పాటు రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ స్థాయులను పసిగట్టే బయోసెన్సర్‌ చిప్‌ను స్విట్జర్లాండ్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు. కేవలం చదరపు సెంటీమీటరు పొడవుండే దీన్ని చర్మం కింద అమర్చితే చాలు. ఎప్పటికప్పుడు గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ వంటి వాటి స్థాయులను గుర్తించి.. బ్లూటూత్‌ ద్వారా ఆ సమాచారాన్ని మొబైల్‌ ఫోన్‌కు చేరవేస్తుంది. ఇది రక్తంలో మందుల ఉనికినీ పసిగడుతుండటం గమనార్హం. ఇందులో ఆరు సెన్సర్లతో కూడిన సర్క్యూట్‌, సంకేతాలను విశ్లేషించే విభాగం, రేడియో ట్రాన్స్‌మిషన్‌ మాడ్యూల్‌ ఉంటాయి. చర్మం మీద అతికించే పట్టీలో ఉండే బ్యాటరీ నుంచి శక్తిని తీసుకోవటానికి ఇందులో ఒక ఇండక్షన్‌ కాయిల్‌ కూడా ఉంటుంది. ఎలుకలపై పరీక్షించి చూడగా.. ఇది గ్లూకోజు స్థాయులను నిరంతరం పర్యవేక్షించినట్టు తేలింది. ఫలితాలు కచ్చితంగా ఉండటంతో దీన్ని 3-5 ఏళ్లలో మనుషులపై పరీక్షించే అవకాశముందని పరిశోధకులు తెలిపారు.
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

18 May 2015

More sleep may lead to paralysis,అతి నిద్రతో పక్షవాతం

  •  




నిద్రలేమితో శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయులు ఎక్కువవుతాయి. దీంతో అధిక రక్తపోటు, పక్షవాతం వంటి రకరకాల సమస్యల ముప్పూ పెరుగుతుంది. కానీ ఎక్కువసేపు నిద్రపోవటం కూడా అనర్థం తెచ్చిపెడుతుందని మీకు తెలుసా? రాత్రి పూట రోజుకి 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయే పెద్దవాళ్లకు పక్షవాతం ముప్పు పొంచి ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. సాధారణంగా రోజుకి రాత్రి పూట 6-8 గంటల సేపు నిద్రపోవాలన్నది నిపుణుల సూచన. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలా నిర్ణీత సమయం మేరకు నిద్రించేవారితో పోలిస్తే 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయేవారికి పక్షవాతం ముప్పు 46% అధికంగా ఉంటున్నట్టు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ అధ్యయనంలో బయటపడింది. ఇందులో భాగంగా పరిశోధకులు 42-81 ఏళ్లకు చెందిన 9,700 మందిని ఎంచుకొని నిద్ర తీరు తెన్నులను నమోదు చేశారు. తొమ్మిదేళ్ల తర్వాత పరిశీలించగా.. 346 మంది పక్షవాతం బారినపడినట్టు తేలింది. వీరిలో రోజుకి 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయేవారికి ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ స్థాయులు, శరీర ఎత్తు బరువుల నిష్పత్తి, శారీరక శ్రమ వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని చూసినా అతి నిద్రతో ముప్పు పొంచి ఉంటుండటం గమనార్హం. తరచుగా నిద్ర పద్ధతులు మారిపోవటం.. అంటే కొన్నిరోజులు 6 గంటల కన్నా తక్కువ సేపు మరికొన్ని రోజులు 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోవటమూ మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటివారికి పక్షవాతం ముప్పు నాలుగు రెట్లు అధికంగా ఉంటోందనీ వివరిస్తున్నారు. అతిగా నిద్రపోవటం పక్షవాతానికి హెచ్చరిక సంకేతమే కావొచ్చు గానీ నిద్ర పద్ధతులు మారిపోవటం మరింత ప్రమాదరకరంగా పరిణమిస్తోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. నిజంగా అతి నిద్రే పక్షవాతానికి కారణమవుతోందా? అతి నిద్ర ఫలితంగా పక్షవాతం సంభవిస్తోందా? లేకపోతే ఏదైనా అనారోగ్యానికి ఇది ముందస్తు సూచికా? అనేవి ఇంకా బయటపడలేదు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని, అందువల్ల పక్షవాతం ముప్పును తగ్గించుకోవటానికి నిద్రించే సమయాన్ని తప్పకుండా తగ్గించుకోవాలని ఇప్పుడప్పుడే చెప్పలేమని అధ్యయన నేత యూ లెంగ్‌ చెబుతున్నారు. అయితే తగినంత నిద్రపోవటం మంచి ఆరోగ్యానికి కీలకమన్న విషయాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు.

  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

15 April 2015

Whim syndrome treatment with gene mutation, జన్యు ఉత్పరివర్తనంతో అరుదైన వ్యాధి 'విమ్‌ సిండ్రోమ్ నయం


  • జన్యు ఉత్పరివర్తనంతో మహిళలో అరుదైన వ్యాధి  'విమ్‌ సిండ్రోమ్ నయం--

లండన్‌: వైద్య చరిత్రలోనే ఆశ్చర్యకరమైన అంశం ఇది. రోగ నిరోధక శక్తి క్షీణించి, నియంత్రణ లేకుండా కణతులు వచ్చే అరుదైన వ్యాధి ఉన్న ఒక మహిళలో అదృష్టవశాత్తూ జరిగిన డీఎన్‌ఏ ఉత్పరివర్తనం ఆ వ్యాధిని నయం చేసింది. దాదాపు 50 ఏళ్ల క్రితం ఒక మహిళ రోగ నిరోధక శక్తిలో లోపం వల్ల శరీరం మొత్తం కణతులు వ్యాపించాయి. ఈ వ్యాధిని 'విమ్‌ సిండ్రోమ్‌'గా వైద్యులు నిర్ధరించారు. డీఎన్‌ఏలోని ఒక భాగంలో లోపం వల్ల ఇది వస్తుంది. ప్రస్తుతం 58 ఏళ్ల వయసున్న సదరు మహిళ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్న తన ఇద్దరు కుమార్తెలను పరీక్షించాల్సిందిగా అమెరికాలోని 'నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అలెర్జీ అండ్‌ ఇన్‌ఫెక్చువస్‌ డిసీజెస్‌' పరిశోధకులను ఇటీవల సంప్రదించింది. తన కణతులు 20 ఏళ్ల క్రితమే తగ్గిపోయాయని ఆమె తెలిపింది. దీంతో ఆమె డీఎన్‌ఏను పరీక్షించిన వైద్యులు అవాక్కయ్యారు. ఆమెకు 30 ఏళ్ల వయసులో ఎముక మజ్జలోని ఒక కణంలో జరిగిన డీఎన్‌ఏ ఉత్పరివర్తనం వల్ల వ్యాధి పూర్తిగా నయమైందని వైద్యులు తేల్చారు. ఉత్పరివర్తనంలో భాగంగా వ్యాధికారక జన్యువు తొలగిపోయిందని తెలిపారు.---09-Feb-2015

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

New technic to detect heat-attack-గుండెపోటును గుర్తించే కొత్త పద్ధతి




  • New technic to detect heat-attack-గుండెపోటును గుర్తించే కొత్త పద్ధతి
జెనీవా: ఒక వ్యక్తి గుండెపోటుకు లోనైన సంగతిని గంట వ్యవధిలో వేగంగా గుర్తించే సరికొత్త పద్ధతిని రూపొందించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనివల్ల వేగంగా, నిక్కచ్చిగా చికిత్స అందించే అవకాశం మెరుగవుతుందని చెబుతున్నారు. గుండెపోటుగా వ్యవహరించే అక్యూట్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ (ఎంఐ) ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మరణాలకు కారణమవుతున్న సమస్య. ప్రాథమిక స్థాయిలో సమస్యను గుర్తించడమే కీలకం. ఈ అధ్యయనంలో భాగంగా.. ఎంఐ వచ్చిందనే అనుమానంతో ఆస్పత్రిని సందర్శించిన 1320 మంది రోగుల్ని ఎంచుకుని రక్తనమూనాలను అత్యంత సున్నితమైన కార్డియాక్‌ ట్రోపోనిన్‌-టీ అల్గారిథమ్‌ ద్వారా పరిశీలించారు. అల్గారిథం సాయంతో 60 శాతం మంది రోగులకు ఎంఐ బారినపడలేదనీ, 16 శాతంమంది ముప్పు బారిన పడినట్లు గుర్తించారు. ప్రస్తుతం వైద్యులు గుండెపోటును గుర్తించేందుకు ఈకేజీ, రక్తపరీక్షలు, యాంజియోగ్రఫీ వంటివి నిర్వహిస్తున్నారు. కాకపోతే ఇవన్నీ గంటలకొద్దీ సమయం తీసుకునే ప్రక్రియలు. ------ 15/April/2015
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/