26 February 2014

Do not sit continusly ,అతిగా కూచోవద్దు





టీవీల ముందు, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూచుంటున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీర్ఘకాలం కూచునేవారికి పెద్దపేగులో బొడిపెలు (పాలిప్స్‌) తిరగబెట్టే అవకాశం ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నడక, పరుగు వంటి వ్యాయామాలు చేసినా ఇలాంటివారికి ఈ ముప్పు తప్పటం లేదనీ చెబుతున్నారు. సాధారణంగా పెద్దపేగు క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొలనోస్కోపీ పరీక్ష చేసేటప్పుడు ఇలాంటివాటిని గుర్తిస్తుంటారు. ఆ సమయంలోనే వాటిని తొలగిస్తుంటారు కూడా. అయితే దీర్ఘకాలం కూచోవటం వల్ల ఇవి తిరిగి ఏర్పడే ప్రమాదం అధికమవుతున్నట్టు అమెరికా పరిశోధకులు గుర్తించారు. రోజుకి 7 గంటల కన్నా తక్కువసేపు కూచునేవారితో పోలిస్తే.. 11 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు కూచునేవారికి ఈ ముప్పు 45% అధికంగా ఉంటున్నట్టు తేలింది. ఇది కేవలం పురుషుల్లోనే కనబడుతుండటం గమనార్హం. నిజానికి ఈ పాలిప్స్‌ క్యాన్సర్‌ రహితమే అయినప్పటికీ.. వీటితో మున్ముందు పెద్దపేగు క్యాన్సర్‌ వచ్చే ముప్పూ పెరుగుతుంది. అందుకే ఇవి ఏర్పడకుండా చూసుకోవటం ఉత్తమం. ''రోజూ నిర్ణీత సమయం మేరకు వ్యాయామంచేసినా.. దీర్ఘకాలం కూచోవటం వల్ల ముందుగానే జబ్బుల బారినపడే అవకాశం పెరుగుతోంది'' అని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్త్టెన్‌ మోల్‌మెంటీ చెబుతున్నారు. అందువల్ల ప్రజారోగ్య సిఫారసుల్లో కూచోవటం తగ్గించాలనే అంశాన్నీ చేర్చాలని సూచిస్తున్నారు
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

01 February 2014

Childhood depression leads to heart diseases,బాల్యంలో కుంగుబాటుతో గుండెజబ్బులు




వాషింగ్టన్‌: బాల్యంలో మానసిక కుంగుబాటుకు గురయ్యే పిల్ల్లలకు టీనేజీదశలోనే (20 ఏళ్లలోపే) గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్థూలకాయం, చురుకుదనం లోపించటం వంటి లక్షణాలతో మొదలై.. చివరికి గుండెసంబంధ సమస్యలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దక్షిణ ఫ్లోరిడా, వాషింగ్టన్‌, పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరిపారు. మానసిక వ్యాకులతకు, గుండెజబ్బులకు మధ్య సంబంధం ఉందని గతంలో జరిగిన పలు అధ్యయనాల్లో వెల్లడైనప్పటికీ.. ఈ రెండింటి మధ్య సంబంధం జీవితంలో ఏ దశలో మొదలవుతుంది? దానిని ఎలా గుర్తించాలి? అన్నవి మాత్రం శేషప్రశ్నలుగానే మిగిలిపోయాయి. తాజాగా జరిగిన పరిశోధన ద్వారా వీటికి సమాధానం లభించింది. చిన్నతనంలో మొదలయ్యే కుంగుబాటుతో గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతుందని, చిన్నప్పుడే సరైన చికిత్సను అందిస్తే ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

  • ===========================
Visit my website at -> Dr.Seshagirirao.com/

Protein treatment for porotic bones, పెళుసు ఎముకలకు ప్రోటీన్‌ చికిత్స

  •  

  •  

వాషింగ్టన్‌: కణంలో ఒక ప్రోటీన్‌ పని చేసే విధానాన్ని, అది పయనించే మార్గాన్ని ఉత్తేజితం చేయటం ద్వారా ఎముకల దృఢత్వాన్ని పెంచవచ్చని, తద్వారా 'ఆస్టియోపొరోసిస్‌'కు సమర్థవంతమైన చికిత్సను అందించవచ్చని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం వైద్యవిభాగం శాస్త్రవేత్తలు అంటున్నారు. వీరు ఎలుకలపై పరిశోధనలు జరిపి.. ఎముకల తయారీ క్రమంలో జరిగే ప్రక్రియలను పరిశీలించారు. డబ్ల్యూఎన్‌టీ అనే రకం ప్రోటీన్లు కణం లోపలికి వచ్చి పలురకాల దారులను ఉత్తేజితం చేస్తాయని వీరు గుర్తించారు. ముఖ్యంగా, డబ్ల్యూఎన్‌టీ 7 బీ అనే రకం ప్రోటీన్‌.. కీలకపాత్ర పోషిస్తోందని వెల్లడైంది. వీటివల్ల, ఎముకల తయారీకణాలు భారీసంఖ్యలో ఉత్పత్తి అవుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అదేసమయంలో ఎముకలు పెళుసుబారే ప్రక్రియపై ఈ ప్రోటీన్‌ ప్రభావం ఏమీ లేదని తెలిపారు. అంటే, వీటివల్ల ఉపయోగమే కానీ.. నష్టం లేదు. ఈ నేపథ్యంలో, డబ్ల్యూఎన్‌టీ 7 బీ మోతాదును కృత్రిమంగా పెంచినప్పుడు.. ఎలుకలు సాధారణ ఎలుకలకన్నా ఎక్కువస్థాయిలో ఎముకలను వృద్ధి చేసుకుంటున్నాయని తెలిసింది. ముఖ్యంగా, కణంలోని ఎంటీఓఆర్‌ అనే మార్గాన్ని ఉత్తేజితం చేసినప్పుడు.. డబ్ల్యూఎన్‌టీ 7 బీ పూర్తిస్థాయిలో పని చేస్తోందని వెల్లడైంది. ఈ పరిశోధన ద్వారా.. పెళుసు ఎముకలతో బాధపడేవారికి సమర్థవంతమైన చికిత్సను అందించటం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/