- Cognetive behaviour therapy for sleep(కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ)-నిద్రకి మాటల చికిత్స
ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. దీంతో రోజువారీ పనులతో తలెత్తిన అలసట, బడలిక తొలగిపోయి కొత్త ఉత్సాహం వస్తుంది. మన శరీరం కూడా నిద్రపోతున్న సమయంలోనే మరమ్మతు చేసుకుంటుంది. అయితే కొందరికి ఒక పట్టాన నిద్రపట్టదు. రాత్రంతా ఎప్పుడు చూసినా మెలకువగా ఉన్నట్టే అనిపిస్తుంటుంది. నిజానికిది పెద్ద సమస్య. ఎందుకంటే నిద్రలేమితో ఏకాగ్రత తగ్గటం, మతిమరుపు వంటివే కాదు.. ఆందోళన, కుంగుబాటు, మధుమేహం వంటి ఇతరత్రా సమస్యల ముప్పూ పొంచి ఉంటుంది. సాధారణంగా నిద్రలేమి దీర్ఘకాలంగా వేధిస్తుంటే డాక్టర్లు నిద్ర మాత్రల వంటివి సిఫారసు చేస్తుంటారు. వీటితో సమస్య తగ్గుతుంది కానీ.. కొన్ని దుష్ప్రభావాలు, మాత్రలకు అలవాటు పడటం వంటి ఇబ్బందులూ ఉంటాయి. అందువల్ల వీరికి ముందుగానే మాత్రలు, మందులు ఇవ్వటం కన్నా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీని ప్రయత్నించటం మేలని, దీంతో మంచి ఫలితం కనబడుతోందని పరిశోధకులు చెబుతున్నారు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది ఒకరకంగా మాటల చికిత్స అనుకోవచ్చు. ఇందులో మన ఆలోచనా పద్ధతులు మారేలా, ఆయా పరిస్థితులకు అనుగుణంగా స్పందించేలా నిపుణులు కౌన్సెలింగ్ ద్వారా నేర్పిస్తారు. ఇలాంటి చికిత్సతో 20 నిమిషాల ముందుగానే కాదు.. 30 నిమిషాల సేపు అధికంగానూ నిద్రపోతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఈ చికిత్స ప్రభావాలు మున్ముందూ కొనసాగుతున్నాయని.. లక్షణాల్లోనూ, హాయిగా ఉన్నామనే భావనలోనూ మెరుగుదల కనిపిస్తోందని అధ్యయన నేత, ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ జేమ్స్ ట్రాయెర్ చెబుతున్నారు. నిద్రలేమిపై గల చెడు ఆలోచనలను, ఆందోళనను తగ్గించటం.. ఒకే సమయానికి నిద్రించేలా చూడటం.. శరీరానికి, మనసుకు విశ్రాంతినిచ్చే పద్ధతులను నేర్పించటం.. ఇవన్నీ కలిసి బాగా పనిచేస్తున్నాయని వివరిస్తున్నారు.
- ===========================
- Visit my website at -> Dr.Seshagirirao.com/