05 June 2013

Creation of Live heart,జీవగుండె సృష్టి




  •     
మార్పిడి చేయటానికి వీలయ్యే గుండెను జీవసాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే ప్రక్రియను పరిశోధకులు ఆవిష్కరించారు. గ్రహీత మూలకణాల్ని ఉపయోగించే గుండెను తయారు చేసే ఈ పరిశోధన కీలకమైన పరీక్షా దశలన్నింటినీ అధిగమించింది.

'హోల్‌ ఆర్గాన్‌ డీసెల్యులరైజేషన్‌'గా పిలిచే సరికొత్త ప్రక్రియలో గుండె కణజాలాన్ని రూపొందించినట్లు మినెసోటా యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా పరిశోధకులు ఎలుక, పంది గుండెలోని కణాలన్నింటినీ పలురకాల రసాయనాల్ని ఉపయోగించి తొలగించారు. చివరికి జిగిబిగి అల్లికలాగా వాటిలోని రక్తనాళాలు మాత్రమే మిగిలాయి. ఆ నాళాల మీదకు మూలకణాల్ని ఇంజెక్ట్‌ చేశారు. వాటికి అవసరమైన పోషకాల్ని కూడా అందజేసి కొత్త అవయవం ఎదిగేలా చేశారు. ఎనిమిది రోజుల వ్యవధిలో ఆ గుండె పంపింగ్‌ చేసే సామర్థ్యాన్ని సంతరించుకుంది. ఇందులోని ప్రాథమిక పరిజ్ఞానం కొత్తదేమీ కాదు. గుండె కవాటాల్ని తయారుచేసే ప్రక్రియలో ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. కాకపోతే.. గుండెతో పోలిస్తే ఈ కవాటాలు చాలా చిన్నవిగా ఉంటాయి. తాము మానవ గుండె పరిమాణంతో సమంగా ఉండే పంది గుండెను ఎంచుకుని ఈ ప్రయోగానికి పూనుకున్నట్లు పరిశోధకులు డాక్టర్‌ డారిస్‌ టేలర్‌ పేర్కొన్నారు. తర్వాతి దశలో మానవ గుండెనే ఇలా పునర్నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం అవయవంలోని కణాల్ని తొలగించే ప్రక్రియలో ఉపయోగించే రసాయనాలు, అవయవం ఎదగటానికి ఉపయోగించే పోషకాల విషయంలో పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం గుండెనే ఈ ప్రక్రియలో నిర్మించి, గుండె మార్పిడి చికిత్స చేయాలనేది తమ లక్ష్యమని, ఈ తరహాలో తయారు చేసిన గుండె జీవనకాలం కూడా ఎక్కువేనని పేర్కొన్నారు.


జీవసాంకేతిక పరిజ్ఞానం సాయంతో గ్రహీత మూలకణాల్నే ఉపయోగించి అవయవాన్ని రూపొందించి అమర్చటం వల్ల గ్రహీత రోగనిరోధక వ్యవస్థ కొత్త అవయవాన్ని తిరస్కరించే అవకాశాలు ఉండవన్నారు. అంటే.. ఎవరికి గుండె అవసరమైతే, వారి శరీరానికి తగిన గుండెను వారి మూలకణాలతోనే తయారుచేసి ఇవ్వగలమని పరిశోధకులు వివరించారు. మామూలుగా మూలకణాలు తమ చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ప్రతిస్పందిస్తుంటాయనీ, అందుకని, మూలకణాల్ని గుండెలోకి ఇంజెక్ట్‌ చేయటం వల్ల గుండె కణాలుగా, కణజాలంగా రూపొందే అవకాశాలు ఎక్కువని పేర్కొన్నారు. ఇప్పటికైతే ఈ ప్రయోగం ప్రాథమిక స్థాయిలోనే ఉన్నా, సమీప భవిష్యత్తులోనే ఈ తరహా గుండెను తయారుచేసి మానవ శరీరంలోకి విజయవంతంగా మార్పిడి చేసే విజయాన్ని సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. 


Courtesy with : Eenadu news paper@sukhibhava


  • =========================
visit my website - Dr.Seshagirirao.com



No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.