26 December 2013

Cause for uncontroled sleep,ఆపుకోలేని నిద్ర కు కారణము

  •  




  •  
 
కొందరు పగటిపూట కూడా తెగ నిద్ర పోతుంటారు. ఎంత ఆపుకొందామనుకున్నా ఆపుకోలేరు. ఎదుటివారితో మాట్లాడుతూనే, పనులు చేస్తూనే హఠాత్తుగా కునికిపాట్లు పడుతుంటారు. ఈ నిద్ర కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల వరకూ ఉండొచ్చు. ఇది ప్రమాదాలకూ దారితీయొచ్చు. ఇలా ఆపుకోవటానికి వీల్లేకుండా ముంచుకొచ్చే నిద్ర సమస్యను 'నార్కోలెప్సీ' అంటారు. దీనికి మన రోగనిరోధకశక్తి గాడి తప్పటమే కారణమని చాలాకాలంగా అనుమానిస్తున్నా రుజువు కాలేదు. అయితే ఇది నిజమేనని పరిశోధకులు తాజాగా గుర్తించారు. హైపోక్రిటిన్‌ అనే రసాయనం మనం మెలకువగా ఉండటానికి తోడ్పడుతుంది. నార్కోలెప్సీ బాధితుల మెదడు లో ఈ రసాయనం స్థాయులు తక్కువగా ఉంటాయి. ఇందుకు హైపోక్రిటిన్‌ను ఉత్పత్తి చేసే మెదడు కణాలపై రోగనిరోధకశక్తి పొరపాటున దాడి చేయటం కారణమని భావిస్తున్నారు. ఇన్‌ఫెక్షన్లతో పోరాడే రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టీ కణాలకు చెందిన ఒక ఉపవర్గం నార్కోలెప్సీ బారినపడ్డవారిలో ప్రత్యేకంగా కనబడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ సమస్యకు జన్యు సంబంధ అంశాలూ దోహదం చేస్తాయి. ఇలాంటి జన్యువులు గలవారిలో హైపోక్రిటిన్‌ మీద రోగనిరోధక వ్యవస్థ దాడి చేసేలా ఇన్‌ఫెక్షన్ల వంటివీ ప్రేరేపిస్తున్నాయని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ ఎలిజబెత్‌ మెలిన్స్‌ చెబుతున్నారు. స్వైన్‌ఫ్లూ బారినపడ్డ పిల్లల్లో నార్కోలెప్సీ సమస్య పెరగటమే దీనికి నిదర్శనమని వివరిస్తున్నారు. కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లు టీ కణాలను అయోమయానికి గురిచేసి హైపోక్రిటిన్‌ ఉత్పిత్తి చేసే కణాలపై దాడి చేసేలా పురికొల్పుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. పగటినిద్రకు రాత్రుళ్లు త్వరగా పడుకోకపోవటం వంటి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి కాబట్టి నార్కోలెప్సీని కచ్చితంగా నిర్ధరించటం కష్టమైన పని. అయితే తాజా పరిశోధన మున్ముందు ఈ సమస్యను గుర్తించే రక్తపరీక్షను రూపొందించేందుకు దారితీయగలదని ఆశిస్తున్నారు. దీంతో రోగనిరోధకశక్తిని తగ్గించే మందులతో చికిత్స చేసే అవకాశమూ ఉండొచ్చని భావిస్తున్నారు.

source : Health Screens and updates Journal
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.