19 March 2014

Diseases in children with tension,ఒత్తిడితో పిల్లలకు జబ్బులు

  •  
  •  

ఒత్తిడి ఆరోగ్యానికి హాని కలిగిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇది పెద్దల్లోనే కాదు.. పిల్లలపైనా గణనీయమైన ప్రభావం చూపుతుంది. చిన్నప్పుడు ఒత్తిడితో బాధపడే పిల్లలకు పెద్దయ్యాక వూబకాయం, ఇతరత్రా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే దీని ప్రభావం మరింత ఎక్కువగానూ.. వూహిస్తున్నదానికన్నా ఇంకా ముందుగానే కనబడుతున్నట్టూ తాజాగా బయటపడింది. వేధింపులకు, హింసకు గురికావటం.. తల్లిదండ్రులు విడిపోవటం.. ఆర్థిక సమస్యల వంటి అనుభవాలను ఎదుర్కొన్న పిల్లలు గ్రహణలోపం, మానసిక, శారీరక, సమస్యల వంటి ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మరికొందరిలో ఈ మూడు సమస్యలు కలిసి ఉండటమూ గమనార్హం. ఇవన్నీ దీర్ఘకాల ఒత్తిడి ప్రభావంతో తలెత్తుతున్నవేనని ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. ఈ దీర్ఘకాల ఒత్తిడి మనసుకూ శరీరానికీ హాని కలిగిస్తుందని, ఇది నాడీసంబంధ హార్మోన్ల వ్యవస్థలోనూ, రోగనిరోధక వ్యవస్థలోనూ మార్పులు తీసుకొస్తోందని వివరిస్తున్నారు. దీంతో జబ్బుల బారినపడే ముప్పూ పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. నిజానికి ఒత్తిడి అనేది జీవితంలో ఒక భాగం. ఎవరైనా దీన్ని ఎదుర్కోవాల్సిందే. ఇది కొత్త విషయాలు నేర్చుకోవటానికి, ఇబ్బందులను అధిగమించటానికి పిల్లలకు తోడ్పడుతుంది కూడా. కానీ ఒత్తిడి తీవ్రమైతే, దీన్ని ఎదుర్కొనే సామర్థ్యం లోపిస్తే మాత్రం దుష్ప్రభావాలకు దారితీస్తుంది. దీర్ఘకాల ఒత్తిడి మూలంగా బాల్యంలో మెదడు అభివృద్ధి అస్తవ్యస్తమవుతుంది. నాడీ, రోగనిరోధక వ్యవస్థలు మందగిస్తాయి. అంతేనా? పెద్దయ్యాక మద్యపానానికి అలవాటు పడటం, కుంగుబాటు, తిండి సమస్యలు, గుండెజబ్బు, క్యాన్సర్‌ వంటి సమస్యలకూ దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల పిల్లలకు ఒత్తిడికి గురవుతున్నట్టు గమనిస్తే వెంటనే జాగ్రత్త పడటం మంచిదని సూచిస్తున్నారు.
  • ==========================
Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.