18 May 2015

More sleep may lead to paralysis,అతి నిద్రతో పక్షవాతం

  •  




నిద్రలేమితో శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయులు ఎక్కువవుతాయి. దీంతో అధిక రక్తపోటు, పక్షవాతం వంటి రకరకాల సమస్యల ముప్పూ పెరుగుతుంది. కానీ ఎక్కువసేపు నిద్రపోవటం కూడా అనర్థం తెచ్చిపెడుతుందని మీకు తెలుసా? రాత్రి పూట రోజుకి 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయే పెద్దవాళ్లకు పక్షవాతం ముప్పు పొంచి ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. సాధారణంగా రోజుకి రాత్రి పూట 6-8 గంటల సేపు నిద్రపోవాలన్నది నిపుణుల సూచన. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలా నిర్ణీత సమయం మేరకు నిద్రించేవారితో పోలిస్తే 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయేవారికి పక్షవాతం ముప్పు 46% అధికంగా ఉంటున్నట్టు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ అధ్యయనంలో బయటపడింది. ఇందులో భాగంగా పరిశోధకులు 42-81 ఏళ్లకు చెందిన 9,700 మందిని ఎంచుకొని నిద్ర తీరు తెన్నులను నమోదు చేశారు. తొమ్మిదేళ్ల తర్వాత పరిశీలించగా.. 346 మంది పక్షవాతం బారినపడినట్టు తేలింది. వీరిలో రోజుకి 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోయేవారికి ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ స్థాయులు, శరీర ఎత్తు బరువుల నిష్పత్తి, శారీరక శ్రమ వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని చూసినా అతి నిద్రతో ముప్పు పొంచి ఉంటుండటం గమనార్హం. తరచుగా నిద్ర పద్ధతులు మారిపోవటం.. అంటే కొన్నిరోజులు 6 గంటల కన్నా తక్కువ సేపు మరికొన్ని రోజులు 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోవటమూ మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటివారికి పక్షవాతం ముప్పు నాలుగు రెట్లు అధికంగా ఉంటోందనీ వివరిస్తున్నారు. అతిగా నిద్రపోవటం పక్షవాతానికి హెచ్చరిక సంకేతమే కావొచ్చు గానీ నిద్ర పద్ధతులు మారిపోవటం మరింత ప్రమాదరకరంగా పరిణమిస్తోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. నిజంగా అతి నిద్రే పక్షవాతానికి కారణమవుతోందా? అతి నిద్ర ఫలితంగా పక్షవాతం సంభవిస్తోందా? లేకపోతే ఏదైనా అనారోగ్యానికి ఇది ముందస్తు సూచికా? అనేవి ఇంకా బయటపడలేదు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని, అందువల్ల పక్షవాతం ముప్పును తగ్గించుకోవటానికి నిద్రించే సమయాన్ని తప్పకుండా తగ్గించుకోవాలని ఇప్పుడప్పుడే చెప్పలేమని అధ్యయన నేత యూ లెంగ్‌ చెబుతున్నారు. అయితే తగినంత నిద్రపోవటం మంచి ఆరోగ్యానికి కీలకమన్న విషయాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు.

  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.