26 July 2015

Radiation with cell phones-సెల్‌ఫోన్‌ రేడియోధార్మికతతో ముప్పు





లండన్‌: సెల్‌ఫోన్‌ వంటి వైర్‌లెస్‌ పరికరాల్నించి వెలువడే రేడియో ధార్మికత జీవక్రియల్లో అసమతుల్యతకు తద్వారా క్యాన్సర్‌, నాడీసంబంధవ్యాధులకు కారణమవుతుందని ఒక పరిశోధన వెల్లడించింది. జీవకణాలపై తక్కువస్థాయి రేడియో ధార్మికత ఎటువంటి ప్రభావం చూపుతుందన్నదానిపై శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. దీంట్లో పాల్గొన్న డాక్టర్‌ ఐగోర్‌ యకిమెంకో మాట్లాడుతూ.. ''దీర్ఘకాలంపాటు రేడియోధార్మికతకు గురైనప్పుడు కణాల్లో ఆక్సీకరణకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. ఫలితంగా జీవక్రియల్లో అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల క్యాన్సర్‌,చర్మసంబంధ వ్యాధులు, నాడీసంబంధమైన జబ్బులు తలెత్తుతున్నట్లు అధ్యయనంలో తెలిసింది'' అని చెప్పారు

25 July 2015

First malaria vaccine-తొలి మలేరియా టీకా


  •  
  •  
ఈఎంఏ సానుకూల అభిప్రాయం--ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమతే తరువాయి
లండన్‌/జెనీవా: ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా టీకా 'మాస్‌క్విరిక్స్‌' తుది అడ్డంకులను అధిగమించింది. యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ (ఈఎంఏ) శుక్రవారం దీనిపై సానుకూలంగా శాస్త్రీయ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఇక దీనికి ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమతిస్తే చాలు. త్వరలోనే ఆఫ్రికా అంతటా ఇవ్వటం ఆరంభమవుతుంది. 30 సంవత్సరాల పరిశోధన తర్వాత రూపొందిన మాస్‌క్విరిక్స్‌కు లండన్‌లోని ఈఎంఏ పచ్చజెండా వూపింది. దీనిని ప్రపంచ ఆరోగ్యసంస్థ పరీక్షించి వచ్చే నవంబరులో తన సిఫారసులను వెలువరించనుంది. ఒకవేళ ఈ టీకాకు అనుమతి లభిస్తే వచ్చే ఐదేళ్లలో ఆఫ్రికా దేశాల్లోని పిల్లలకు ఇవ్వనున్నారు. ''ఇది గొప్ప ముందడుగు. మలేరియా టీకాపై ఈఎంఏ సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేయటాన్ని స్వాగతిస్తున్నాం. ఇది అభిప్రాయం మాత్రమే. అనుమతి కాదు'' అని ప్రపంచ ఆరోగ్యసంస్థలో బర్డ్‌ఫ్లూ, ఇతర మహమ్మారి జబ్బుల విభాగం అధికార ప్రతినిధి గ్రెగరీ హార్ట్‌ల్‌ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దీనికి గల సాధ్యాసాధ్యాలు, చవకగా అందుబాటులో ఉంచటం వంటి వాటిపై సమీక్షించనున్నామని వివరించారు. మలేరియా టీకాపై ఈఎంఏ సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేయటంపై గ్లాక్సోస్మిత్‌క్త్లెన్‌ కంపెనీకి తూర్పు ఆఫ్రికాలో ఉపాధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న అలన్‌ పంబా హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. మాస్‌క్విరిక్స్‌ టీకా రూపకల్పన కోసం గ్లాక్సోస్మిత్‌క్త్లెన్‌ కంపెనీ ఇప్పటివరకు సుమారు రూ.23 వేల కోట్లు (35.6 కోట్ల డాలర్లు) ఖర్చు చేసింది. మలేరియాకు టీకాలను రూపొందించటానికి పరిశోధకులతో పాటు పలు మందుల కంపెనీలు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాయి. కొన్నింటిని తయారుచేసినప్పటికీ అవి ప్రయోగ పరీక్షల్లో విఫలమయ్యాయి. ఇది గొప్ప విజయమని, కానీ ఇంకా పని పూర్తికాలేదని హార్ట్‌ల్‌ పేర్కొన్నారు. ఇప్పుడు తమ పని మొదలవుతుందన్నారు. గ్లాక్సోస్మిత్‌క్త్లెన్‌, పాత్‌ మలేరియా వ్యాక్సిన్‌ ఇనీషియేటివ్‌ భాగస్వామ్యంతో ఏడు దేశాల్లోని 11 పరిశోధన కేంద్రాల్లో ఈ టీకా ప్రయోగ పరీక్షలను నిర్వహించారు. అయితే ఇది ఇతర రోగనిరోధక కార్యక్రమాల కన్నా తక్కువ స్థాయిలోనే రక్షణ కల్పిస్తున్నట్టు బయటపడింది. టీకాను తీసుకున్న నాలుగేళ్ల తర్వాత దీని రక్షణ ప్రభావం 36% వరకు పడిపోతున్నట్టు తేలింది. తుది అనుమతి ఇచ్చేముందు ఇలాంటి విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని ప్రపంచ ఆరోగ్యసంస్థ అధికారి ఒకరు తెలిపారు.

Glucoma medicine helps to treat resistence TB-మొండి క్షయకు నీటికాసుల మందు

  •  

  •  
నీటికాసుల (గ్లకోమా) చికిత్సలో వాడే ఎథాగ్జోలమైడ్‌ మందు క్షయను నిలువరించటానికీ తోడ్పడుతున్నట్టు మిచిగన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయం (ఎంఎస్‌యూ) పరిశోధకులు గుర్తించారు. ఇది రోగనిరోధక వ్యవస్థలోకి క్షయ చొరబడే సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తుండటం గమనార్హం. ''క్షయ కారక బ్యాక్టీరియా రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని తెల్ల రక్త కణాల్లో వృద్ధి చెందటానికి అవసరమైన సామర్థ్యాన్ని ఎథాగ్జోలమైడ్‌ పూర్తిగా తగ్గిస్తోంది'' అని ఎంఎస్‌యూ శాస్త్రవేత్త రాబర్ట్‌ అబ్రామోవిచ్‌ తెలిపారు. శరీరంలో ఆమ్ల స్థాయుల వంటి అనువైన పరిస్థితులను పసిగడుతూ క్షయ కారక బ్యాక్టీరియా వాటికి అనుగుణంగా మారుతుంది. ఈ సామర్థ్యాన్ని ఎథాగ్జోలమైడ్‌ నిలువరిస్తున్నట్టు గుర్తించామని అబ్రామోవిచ్‌ పేర్కొన్నారు. ఇది క్షయ వ్యాప్తిని నివారించటానికే కాదు. చికిత్స సమయాన్ని తగ్గించటానికి, క్షయ కారక క్రిమి మందులను తట్టుకునేలా మారటాన్ని ఆలస్యం చేయటానికీ తోడ్పడగలదన్నారు. ఈ మందు ఎలుకల్లో క్షయ లక్షణాలను తగ్గించినట్టు గుర్తించామని తెలిపారు.

Root of over-eating is in brain!-అతి తిండికి మూలం మెదడులో!

  •  

  •  
కొందరు కేవలం ఆనందం కోసమే అతిగా తింటుంటారు. దీనికి గ్లుకాగోన్‌ తరహా పెప్త్టెడ్‌-1 (జీఎల్‌పీ-1) హార్మోన్‌ మెదడులో లేకపోవటం పాక్షికంగా కారణమవుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. ఇది వూబకాయానికి తక్కువ దుష్ప్రభావాలతో ప్రత్యేకమైన చికిత్సలను రూపొందించటానికి దారితీయగలదని ఆశిస్తున్నారు. కేంద్ర నాడీవ్యవస్థలో జీఎల్‌పీ-1 హార్మోన్‌ తగ్గినపుడు అతిగా.. అదీ ఎక్కువ కొవ్వుతో కూడిన ఆహారాన్ని తినటానికి దారితీస్తున్నట్టు రాబర్ట్‌ వుడ్‌ జాన్సన్స్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు గుర్తించారు. ఎలుకల మెదడులో జీఎల్‌పీ-1 హార్మోన్‌ సంకేతాలను ప్రేరేపించగా అధిక కొవ్వు పదార్థాలను ఎంచుకోవటం ఆగిపోయిందని సహ అధ్యయన కర్త విన్సెంట్‌ మిరాబెల్లా తెలిపారు. అమైనో ఆమ్లాల అమరికతో కూడిన జీఎల్‌పీ-1 పెప్త్టెడ్లు మన ఆహార అలవాట్లను నియంత్రించటం వంటి రకరకాల పనుల్లో పాలు పంచుకుంటాయి. చిన్న పేగులు, మెదడులోని కణాల నుంచి పుట్టుకొచ్చే ఇవి భోజనం చేస్తున్నప్పుడు కడుపు నిండిందనే విషయాన్ని మెదడుకు చేరవేస్తాయి. నిజానికి అతిగా తినటానికి ఇవొక్కటే కారణం కాకపోయినప్పటికీ.. మెదడులో మెసోలింబిక్‌ డొపమైన్‌ వ్యవస్థలోని నాడీ కణాలపై మాత్రమే పనిచేసే చికిత్సలతో అతిగా తినటాన్ని నియంత్రించొచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది. తక్కువ దుష్ప్రభావాలతో వూబకాయానికి చికిత్స చేసే అవకాశముందని పరిశోధకులు భావిస్తున్నారు