25 July 2015

First malaria vaccine-తొలి మలేరియా టీకా


  •  
  •  
ఈఎంఏ సానుకూల అభిప్రాయం--ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమతే తరువాయి
లండన్‌/జెనీవా: ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా టీకా 'మాస్‌క్విరిక్స్‌' తుది అడ్డంకులను అధిగమించింది. యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ (ఈఎంఏ) శుక్రవారం దీనిపై సానుకూలంగా శాస్త్రీయ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఇక దీనికి ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమతిస్తే చాలు. త్వరలోనే ఆఫ్రికా అంతటా ఇవ్వటం ఆరంభమవుతుంది. 30 సంవత్సరాల పరిశోధన తర్వాత రూపొందిన మాస్‌క్విరిక్స్‌కు లండన్‌లోని ఈఎంఏ పచ్చజెండా వూపింది. దీనిని ప్రపంచ ఆరోగ్యసంస్థ పరీక్షించి వచ్చే నవంబరులో తన సిఫారసులను వెలువరించనుంది. ఒకవేళ ఈ టీకాకు అనుమతి లభిస్తే వచ్చే ఐదేళ్లలో ఆఫ్రికా దేశాల్లోని పిల్లలకు ఇవ్వనున్నారు. ''ఇది గొప్ప ముందడుగు. మలేరియా టీకాపై ఈఎంఏ సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేయటాన్ని స్వాగతిస్తున్నాం. ఇది అభిప్రాయం మాత్రమే. అనుమతి కాదు'' అని ప్రపంచ ఆరోగ్యసంస్థలో బర్డ్‌ఫ్లూ, ఇతర మహమ్మారి జబ్బుల విభాగం అధికార ప్రతినిధి గ్రెగరీ హార్ట్‌ల్‌ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దీనికి గల సాధ్యాసాధ్యాలు, చవకగా అందుబాటులో ఉంచటం వంటి వాటిపై సమీక్షించనున్నామని వివరించారు. మలేరియా టీకాపై ఈఎంఏ సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేయటంపై గ్లాక్సోస్మిత్‌క్త్లెన్‌ కంపెనీకి తూర్పు ఆఫ్రికాలో ఉపాధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న అలన్‌ పంబా హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. మాస్‌క్విరిక్స్‌ టీకా రూపకల్పన కోసం గ్లాక్సోస్మిత్‌క్త్లెన్‌ కంపెనీ ఇప్పటివరకు సుమారు రూ.23 వేల కోట్లు (35.6 కోట్ల డాలర్లు) ఖర్చు చేసింది. మలేరియాకు టీకాలను రూపొందించటానికి పరిశోధకులతో పాటు పలు మందుల కంపెనీలు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాయి. కొన్నింటిని తయారుచేసినప్పటికీ అవి ప్రయోగ పరీక్షల్లో విఫలమయ్యాయి. ఇది గొప్ప విజయమని, కానీ ఇంకా పని పూర్తికాలేదని హార్ట్‌ల్‌ పేర్కొన్నారు. ఇప్పుడు తమ పని మొదలవుతుందన్నారు. గ్లాక్సోస్మిత్‌క్త్లెన్‌, పాత్‌ మలేరియా వ్యాక్సిన్‌ ఇనీషియేటివ్‌ భాగస్వామ్యంతో ఏడు దేశాల్లోని 11 పరిశోధన కేంద్రాల్లో ఈ టీకా ప్రయోగ పరీక్షలను నిర్వహించారు. అయితే ఇది ఇతర రోగనిరోధక కార్యక్రమాల కన్నా తక్కువ స్థాయిలోనే రక్షణ కల్పిస్తున్నట్టు బయటపడింది. టీకాను తీసుకున్న నాలుగేళ్ల తర్వాత దీని రక్షణ ప్రభావం 36% వరకు పడిపోతున్నట్టు తేలింది. తుది అనుమతి ఇచ్చేముందు ఇలాంటి విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని ప్రపంచ ఆరోగ్యసంస్థ అధికారి ఒకరు తెలిపారు.

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.