- ===========================
Collection of new developments and updates in Medical fields in Telugu language by Dr.Seshagirirao MBBS,(Srikakulam).
19 March 2014
Anaemia with Proton pump inhibitor ,ఛాతీమంట మందులతో రక్తహీనత
Diseases in children with tension,ఒత్తిడితో పిల్లలకు జబ్బులు
ఒత్తిడి ఆరోగ్యానికి హాని కలిగిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇది పెద్దల్లోనే కాదు.. పిల్లలపైనా గణనీయమైన ప్రభావం చూపుతుంది. చిన్నప్పుడు ఒత్తిడితో బాధపడే పిల్లలకు పెద్దయ్యాక వూబకాయం, ఇతరత్రా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే దీని ప్రభావం మరింత ఎక్కువగానూ.. వూహిస్తున్నదానికన్నా ఇంకా ముందుగానే కనబడుతున్నట్టూ తాజాగా బయటపడింది. వేధింపులకు, హింసకు గురికావటం.. తల్లిదండ్రులు విడిపోవటం.. ఆర్థిక సమస్యల వంటి అనుభవాలను ఎదుర్కొన్న పిల్లలు గ్రహణలోపం, మానసిక, శారీరక, సమస్యల వంటి ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మరికొందరిలో ఈ మూడు సమస్యలు కలిసి ఉండటమూ గమనార్హం. ఇవన్నీ దీర్ఘకాల ఒత్తిడి ప్రభావంతో తలెత్తుతున్నవేనని ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. ఈ దీర్ఘకాల ఒత్తిడి మనసుకూ శరీరానికీ హాని కలిగిస్తుందని, ఇది నాడీసంబంధ హార్మోన్ల వ్యవస్థలోనూ, రోగనిరోధక వ్యవస్థలోనూ మార్పులు తీసుకొస్తోందని వివరిస్తున్నారు. దీంతో జబ్బుల బారినపడే ముప్పూ పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. నిజానికి ఒత్తిడి అనేది జీవితంలో ఒక భాగం. ఎవరైనా దీన్ని ఎదుర్కోవాల్సిందే. ఇది కొత్త విషయాలు నేర్చుకోవటానికి, ఇబ్బందులను అధిగమించటానికి పిల్లలకు తోడ్పడుతుంది కూడా. కానీ ఒత్తిడి తీవ్రమైతే, దీన్ని ఎదుర్కొనే సామర్థ్యం లోపిస్తే మాత్రం దుష్ప్రభావాలకు దారితీస్తుంది. దీర్ఘకాల ఒత్తిడి మూలంగా బాల్యంలో మెదడు అభివృద్ధి అస్తవ్యస్తమవుతుంది. నాడీ, రోగనిరోధక వ్యవస్థలు మందగిస్తాయి. అంతేనా? పెద్దయ్యాక మద్యపానానికి అలవాటు పడటం, కుంగుబాటు, తిండి సమస్యలు, గుండెజబ్బు, క్యాన్సర్ వంటి సమస్యలకూ దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల పిల్లలకు ఒత్తిడికి గురవుతున్నట్టు గమనిస్తే వెంటనే జాగ్రత్త పడటం మంచిదని సూచిస్తున్నారు.
- ==========================
14 March 2014
Bowel and Rectal Cancer with Obesity, వూబకాయం వలన పెద్దపేగు క్యాన్సర్
ప్రస్తుతం కొలనోస్కోపీ పరీక్ష చేసే విషయంలో వయసు, కుటుంబ చరిత్రను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనికి అధిక బరువునూ జోడించాల్సిన అవసరముందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అధ్యయనంలో భాగంగా కొందరు వూబకాయులకు కొలనోస్కోపీ పరీక్ష చేయగా.. 30% మందిలో ఒకటి కన్నా ఎక్కువ బుడిపెలు ఉంటున్నట్టు తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. మరి కాస్త ఎక్కువ వూబకాయులకైతే మూడు బుడిపెలుండే అవకాశం 6.5 రెట్లు ఎక్కువగా ఉంటోందనీ వివరిస్తున్నారు. లెప్టిన్ మోతాదులు ఎక్కువగా ఉండటం మూలంగా పెద్దపేగులోని క్యాన్సర్ ముందస్తుదశ కణాలకు రక్తసరఫరా పెరిగి, అవి వృద్ధి చెందటానికి దోహదం చేస్తోందని పేర్కొంటున్నారు. వూబకాయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధ్యయన ఫలితాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
- ===========================
11 March 2014
New blood test detection of Alzimer disease ,అల్జీమర్స్‌ను అంచనా వేసే కొత్త రక్తపరీక్ష
- ===========================
Cancer is less in mothers of more children,ఎక్కువమంది పిల్లలను కన్న తల్లులకు కేన్సర్ దూరం
పది మంది లేదా అంతకన్నా ఎక్కువమంది పిల్లలను కన్న తల్లులకు కేన్సర్ వచ్చే ప్రమాదం చాలాతక్కువని ఫిన్లండ్ శాస్త్రవేత్తలు తేల్చారు. పరిశోధనలో భాగంగా.. ఫిన్లండ్‌కు చెందిన 5,000 మంది మహిళలపై వీరు అధ్యయనం నిర్వహించారు. ఈ మహిళలందరూ 2010కన్నా ముందు కనీసం పదిమంది పిల్లలకు జన్మనిచ్చిన వాళ్లే. వీరంతా లూథరిన్ చర్చికి చెందిన లీస్టడియన్ వర్గ సభ్యులు. వీరి దైనందినజీవితం సాధారణ మహిళల్లాగే ఉన్నప్పటికీ.. గర్భనిరోధక సాధనాలను ఉపయోగించటం వీరి మతంలో నిషిద్ధం. ఈ నేపథ్యంలోనే, వీరిలో పదిమంది సంతానాన్ని కలిగి ఉండటం సాధారణ విషయం. ఈ మతానికి చెందిన ఐదువేలమందిపై శాస్త్రవేత్తలు సర్వే జరిపినప్పుడు.. మూడుదశాబ్దాల వ్యవధిలో 656 మంది కేన్సర్ వ్యాధిని ఎదుర్కొన్నట్లు తేలింది. ఫిన్లండ్‌లో కేన్సర్ బాధిత స్త్రీలకు సంబంధించిన గణాంకాల ఆధారంగా చూస్తే.. 5,000 మందిలో సగటున 856 మంది కేన్సర్ బారిన పడుతున్నారు. అంటే, పదిమందికన్నా ఎక్కువమంది పిల్లలున్న తల్లుల విషయంలో ఈ సంఖ్య 200 తక్కువగా ఉందని తేలింది. అదే విధంగా కేన్సర్ వ్యాధిని కొత్తగా ఎదుర్కొంటున్న వాళ్లు కూడా ఈ మహిళల్లో తక్కువేనని, సాధారణం కంటే వీరి సంఖ్య 24 శాతం తక్కువగా ఉందని వెల్లడైంది. చిన్నవయసులో తల్లి కావటం వల్ల రొమ్ముకేన్సర్ నుంచి రక్షణ లభిస్తుందని ఇంతకుముందే పలు పరిశోధనల్లో రుజువైంది. కానీ, ఎక్కువమంది పిల్లలను కన్న తల్లులకు కూడా కేన్సర్ దూరంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది.
- ===========================
26 February 2014
Do not sit continusly ,అతిగా కూచోవద్దు
టీవీల ముందు, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూచుంటున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీర్ఘకాలం కూచునేవారికి పెద్దపేగులో బొడిపెలు (పాలిప్స్) తిరగబెట్టే అవకాశం ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నడక, పరుగు వంటి వ్యాయామాలు చేసినా ఇలాంటివారికి ఈ ముప్పు తప్పటం లేదనీ చెబుతున్నారు. సాధారణంగా పెద్దపేగు క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొలనోస్కోపీ పరీక్ష చేసేటప్పుడు ఇలాంటివాటిని గుర్తిస్తుంటారు. ఆ సమయంలోనే వాటిని తొలగిస్తుంటారు కూడా. అయితే దీర్ఘకాలం కూచోవటం వల్ల ఇవి తిరిగి ఏర్పడే ప్రమాదం అధికమవుతున్నట్టు అమెరికా పరిశోధకులు గుర్తించారు. రోజుకి 7 గంటల కన్నా తక్కువసేపు కూచునేవారితో పోలిస్తే.. 11 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు కూచునేవారికి ఈ ముప్పు 45% అధికంగా ఉంటున్నట్టు తేలింది. ఇది కేవలం పురుషుల్లోనే కనబడుతుండటం గమనార్హం. నిజానికి ఈ పాలిప్స్ క్యాన్సర్ రహితమే అయినప్పటికీ.. వీటితో మున్ముందు పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ముప్పూ పెరుగుతుంది. అందుకే ఇవి ఏర్పడకుండా చూసుకోవటం ఉత్తమం. ''రోజూ నిర్ణీత సమయం మేరకు వ్యాయామంచేసినా.. దీర్ఘకాలం కూచోవటం వల్ల ముందుగానే జబ్బుల బారినపడే అవకాశం పెరుగుతోంది'' అని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్త్టెన్ మోల్‌మెంటీ చెబుతున్నారు. అందువల్ల ప్రజారోగ్య సిఫారసుల్లో కూచోవటం తగ్గించాలనే అంశాన్నీ చేర్చాలని సూచిస్తున్నారు
- ===========================
Labels:
Do not sit continusly,
అతిగా కూచోవద్దు
01 February 2014
Childhood depression leads to heart diseases,బాల్యంలో కుంగుబాటుతో గుండెజబ్బులు
వాషింగ్టన్: బాల్యంలో మానసిక కుంగుబాటుకు గురయ్యే పిల్ల్లలకు టీనేజీదశలోనే (20 ఏళ్లలోపే) గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్థూలకాయం, చురుకుదనం లోపించటం వంటి లక్షణాలతో మొదలై.. చివరికి గుండెసంబంధ సమస్యలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దక్షిణ ఫ్లోరిడా, వాషింగ్టన్, పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరిపారు. మానసిక వ్యాకులతకు, గుండెజబ్బులకు మధ్య సంబంధం ఉందని గతంలో జరిగిన పలు అధ్యయనాల్లో వెల్లడైనప్పటికీ.. ఈ రెండింటి మధ్య సంబంధం జీవితంలో ఏ దశలో మొదలవుతుంది? దానిని ఎలా గుర్తించాలి? అన్నవి మాత్రం శేషప్రశ్నలుగానే మిగిలిపోయాయి. తాజాగా జరిగిన పరిశోధన ద్వారా వీటికి సమాధానం లభించింది. చిన్నతనంలో మొదలయ్యే కుంగుబాటుతో గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతుందని, చిన్నప్పుడే సరైన చికిత్సను అందిస్తే ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
- ===========================
Subscribe to:
Posts (Atom)






