19 July 2013

Fiber prevents paralysis,పీచుతో పక్షవాతం దూరం.


  •  
  •  
పీచుతో మలబద్ధకం తగ్గటం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నది తెలిసిందే. ఇది పక్షవాతం ముప్పు తగ్గటానికీ దోహదం చేస్తున్నట్టు తాజాగా బయటపడింది. పీచు మోతాదు పెరిగినకొద్దీ పక్షవాతం ముప్పూ తగ్గుతుండటం గమనార్హం. రోజూ తినే పీచు పదార్థంలో ప్రతి 7 గ్రాముల మోతాదుకూ పక్షవాతం ముప్పు 7% వరకు తగ్గుతున్నట్టు తేలింది. బ్రిటన్‌ పరిశోధకులు 20 ఏళ్ల పాటు అధ్యయనం చేసి ఈ విషయాన్ని గుర్తించారు. మనలో చాలామంది పీచుతో కూడిన పదార్థాలు తగినంతగా తీసుకోవటం లేదు. ఈ నేపథ్యంలో తాజా పరిశోధన ప్రాధాన్యం సంతరించుకుందని లీడ్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన విక్టోరియా బూర్లే పేర్కొంటున్నారు. మనకు రోజుకి 25-30 గ్రాముల పీచు అవసరం. కానీ చాలామంది ఇందులో సగం కూడా తీసుకోవటం లేదు. రోజుకి 7 గ్రాముల పీచు అందించే పదార్థాలనైనా తినటం లేదని పరిశోధకులు చెబుతున్నారు. పండ్లు, గింజపప్పులు, కూరగాయలు, ముడిధాన్యాల వంటి వృక్ష సంబంధ పీచు.. పక్షవాతాన్ని తెచ్చిపెట్టే అధిక రక్తపోటు, ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ వంటి ముప్పులను తగ్గిస్తున్నట్టు ఇంతకుముందే వెల్లడైంది. తాజా అధ్యయనం దీన్ని మరింత బలపరిచింది. మెదడుకు రక్తసరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం లేదా మెదడులోని రక్తనాళాలు చిట్లటం వల్ల పక్షవాతం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు కారణమవుతున్న జబ్బుల్లో ఇది రెండోది. ఏటా సుమారు 60 లక్షల మంది పక్షవాతం మూలంగా చనిపోతున్నారని అంచనా. అందువల్ల దీన్ని నివారించుకునేందుకు పీచును కాస్త ఎక్కువగా తీసుకోవటం వంటి చిన్న విధానాలైనా సరే.. పాటించటం ఎంతో మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పక్షవాతం ముప్పు పొంచున్న పొగ అలవాటు గలవారు, ఊబకాయులు, అధిక రక్తపోటు బాధితులకు ఇదెంతో అవసరమని వివరిస్తున్నారు. పీచు మోతాదు పెంచుకోవటానికి మొత్తం ఆహారాన్ని మార్చుకోవాల్సిన పనేమీ లేదు. మైదా పిండికి బదులు గోధుమలను మర పట్టించి వాడుకోవటం, మరీ తెల్లటి బియ్యానికి బదులు దంపుడు బియ్యం తీసుకోవటం వంటివి చేయొచ్చు. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలి.

===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.