01 September 2013

Pancreas cancer with infection,ఇన్‌ఫెక్షన్లతో క్లోమ క్యాన్సర్‌

  •  
  •  

 Pancreas cancer with infection,ఇన్‌ఫెక్షన్లతో క్లోమ క్యాన్సర్‌ (1st sept.2013)

అన్ని క్యాన్సర్లలో క్లోమగ్రంథికి (పాంక్రియాస్‌కు) వచ్చే క్యాన్సర్‌ చాలా తీవ్రమైంది. దీనికి చికిత్స చేయటం కష్టం. అందువల్ల పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ బారినపడ్డవారిలో సుమారు 96% మంది మరణించే అవకాశముంది. నిజానికి ఇది రావటానికి ప్రధాన కారణమేంటో ఇప్పటికీ తెలియదు. పొగ తాగటం, వూబకాయం, మధుమేహం, మద్యం అలవాటు, దీర్ఘకాలం క్లోమం వాపు వంటివి దీనికి దారితీస్తాయి. తాజాగా పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌లో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు.. ముఖ్యంగా పేగుల్లో, దంతాల్లో తలెత్తే ఇన్‌ఫెక్షన్ల పాత్రా ఉంటున్నట్టు బయటపడింది. జీర్ణాశయ క్యాన్సర్‌, పెప్టిక్‌ అల్సర్‌తో సంబంధం గల హెలికోబ్యాక్టర్‌ పైలోరీ.. దంతాలు, చిగుళ్లను దెబ్బతీసే పార్ఫీర్మోమోనస్‌ జింజివలిస్‌ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు గలవారికి పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. ఈ ఇన్‌ఫెక్షన్లు శరీరమంతటా వాపును ప్రేరేపిస్తాయని, ఇది పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌కు దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు. అంతేకాదు ఈ ఇన్‌ఫెక్షన్లు రోగనిరోధక వ్యవస్థలో మార్పులకూ దారితీస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనమైతే శరీరం క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కోలేదు. ఇలాంటి పరిస్థితికి పొగ అలవాటు, వూబకాయం, మధుమేహం వంటి ముప్పు కారకాలూ తోడైతే.. రోగ నిరోధక ప్రతిస్పందన బలహీనపడి, మరిన్ని ఇన్‌ఫెక్షన్లూ దాడిచేస్తాయి. క్లోమగ్రంథిలో కణితి వృద్ధికి తోడ్పడే వ్యవస్థలనూ ఈ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు నేరుగా ప్రేరేపిస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు.

నిజానికి క్యాన్సర్లకూ ఇన్‌ఫెక్షన్లకూ సంబంధం ఉన్నట్టు గుర్తించటం కొత్త విషయమేమీ కాదు. హెపటైటిస్‌ బి, సి వైరస్‌ల మూలంగా కాలేయ క్యాన్సర్‌.. హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌తో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌.. ఎప్‌స్త్టెన్‌-బార్‌ వైరస్‌తో ముక్కు, గొంతు పైభాగంలో క్యాన్సర్‌ వస్తున్నట్టు ఇప్పటికే తేలింది. అందువల్ల పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌లో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల పాత్రను మరింత బాగా అర్థం చేసుకుంటే తొలిదశలోనే దీన్ని గుర్తించి, చికిత్స చేయటానికి అవకాశముంటుందని పరిశోధకులు ఆశిస్తున్నారు.
  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.