20 October 2013

Enzyme acting as double edged Knife,రెండురకాలుగా వ్యవహరిస్తున్నఎంజైమ్‌




వాషింగ్టన్‌: హెచ్‌ఐవీ వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లను ఎదుర్కొని శరీరానికి రక్షణ కల్పించే ఒక ఎంజైమ్‌.. కేన్సర్‌కు కారణమవుతోందని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సదరు ఎంజైమ్‌ వల్ల జరిగే డీఎన్‌ఏ ఉత్పరివర్తనాలు చివరికి కేన్సర్‌కు దారి తీస్తున్నాయని వారి పరిశోధనలో వెల్లడైంది. మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన ఈ శాస్త్రవేత్తలు 'ఏపీఓబీఈసీ3బీ' అనే ఎంజైమ్‌ పలు రకాల కేన్సర్లకు కారణమవుతోందని గుర్తించారు. ఈ పరిశోధకులు 19 రకాల కేన్సర్‌ కణితుల నమూనాలను విశ్లేషించి.. వాటిల్లో 'ఏపీఓబీఈసీ3బీ' ఎంజైమ్‌ ఉందా లేదా అన్నది పరిశీలించారు. ఈ మేరకు వారికి.. మూత్రాశయం, గర్భాశయం, తల, మెడ, రొమ్ముతోపాటు రెండురకాల వూపిరితిత్తుల కేన్సర్లలో 'ఏపీఓబీఈసీ3బీ' ఎంజైమ్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి, ఈ ఎంజైమ్‌ ఆరోగ్యంగా ఉండే కణజాలాలన్నింటిలోనూ తక్కువ మోతాదులో కనిపిస్తుంది. కానీ, కేన్సర్‌ కణజాలంలో మాత్రం దీని మోతాదు ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు గుర్తించారు. రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే 'ఏపీఓబీఈసీ3బీ' ఎంజైమ్‌ హెచ్‌ఐవీ వంటి ప్రమాదకరమైన వైరస్‌ల నుంచి ఆరోగ్యవంతమైన కణాల్ని కాపాడుతుంది. ఓవైపు ఈ విధంగా రక్షణ కల్పిస్తూనే ఇది కేన్సర్‌కు కారణమవుతుందని తాజా పరిశోధనల ద్వారా వెల్లడైంది. ఈ ఎంజైమ్‌ రెండువైపులా పదునున్న కత్తి వంటిదని, దీంతో లాభం ఉన్నట్లే, నష్టం కూడా ఉందని.. ఈ మేరకు దీనిని నియంత్రించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలంటున్నారు.
  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.