24 October 2013

New treatment for asthma,ఆస్థమాకు కొత్త చికిత్స




వాషింగ్టన్‌: వ్యాధిలో కీలక పాత్ర పోషించే ఎంజైమ్‌ గుర్తింపు. గుండె జబ్బులో పాత్ర ఉన్న ఒక ఎంజైమ్‌ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఆస్థమాకు మెరుగైన చికిత్స చేయవచ్చని అమెరికాలోని అయోవా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తేల్చారు. పరిశోధన బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉన్నారు. సీఏఎంకే2 అనే ఈ ఎంజైమ్‌కు శ్వాసమార్గంలో ఆక్సీకరణానికి సంబంధించిన హానికారక ప్రభావాలతో సంబంధం ఉందని వీరు గుర్తించారు. ఇది ఆస్థమా లక్షణాలను ప్రేరేపిస్తుందని తెలిపారు. సీఏఎంకేఈ2ను లక్ష్యంగా చేసుకొని మందులు తయారుచేయడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తుందని తెలిపారు.

ఆస్థమా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లమందిని పీడిస్తోంది. అయినా చికిత్స పరంగా స్టెరాయిడ్లు మాత్రమే ఉంటున్నాయి. వీటివల్ల ఇతరత్రా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ప్రస్తుత చికిత్స విధానాలు సరిగా పనిచేయడంలేదని పరిశోధనలో పాలుపంచుకున్న మార్క్‌ ఆండర్సన్‌ తెలిపారు. సీఏఎంకే2ను అడ్డుకోవడం ద్వారా అలర్జిక్‌ ఆస్థమాకు మెరుగైన చికిత్స చేయవచ్చని వివరించారు. ఈ ఎంజైమ్‌.. గుండె కండరాల కణాల ఆక్సీకరణంలో కీలక పాత్రషోషిస్తోందని, దీనివల్ల గుండె జబ్బులు, గుండెపోటు వస్తోందని లోగడ తేలిందన్నారు. శ్వాసకోశ వ్యవస్థ ఆక్సీకరణంలోనూ దీనికి పాత్ర ఉండొచ్చని తమకు అనిపించిందని తెలిపారు. తొలుత వీరు ఈ ఎంజైమ్‌ను ఎలుకల శ్వాసనాళ కండర కణాల్లో పరీక్షించారు. అయితే పెద్దగా ప్రభావం కనిపించలేదు. ఆ తర్వాత ఎంజైమ్‌ను శ్వాస నాళం లైనింగ్‌ (ఎపిథీలియల్‌) కణాల్లో పరీక్షించారు. ఎంజైమ్‌ను అడ్డుకున్న ఎలుకల్లో సీఎఎంకే2 ఆక్సీకరణం తక్కువగా ఉందని గుర్తించారు. వీటిలో శ్వాసనాళం కండరం కుంచించుకుపోవడంగానీ, ఆస్థమా లక్షణాలు గానీ కనిపించలేదు. ఎంజైమ్‌ను అడ్డుకోని ఎలుకల్లో మాత్రం ఆక్సీకరణ ఒత్తిడి ఎక్కువగా ఉందని. ఫలితంగా శ్వాసనాళం కుంచించుకుపోయి ఆస్థమా లక్షణాలు కనిపించాయి.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.