02 October 2013

New eye test to detect blindness in advance,అంధత్వ ప్రమాదాన్ని గుర్తించే సరికొత్త కంటిపరీక్ష




మెల్‌బోర్న్‌: వయసుతో పాటు పెరిగే కంటిపాప క్షయం(ఏఎండీ-age related macular degeneration) జబ్బును ముందే గుర్తించేందుకు సులభమైన కంటి పరీక్ష విధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వ్యాధి ప్రాథమిక దశలో చూపు ఉంటుంది కానీ, క్రమంగా కంటిలోని మిగతా భాగాలనూ ఇది దెబ్బతీసి అంధత్వానికి దారితీస్తుందని ఆస్ట్రేలియాకు చెందిన దృష్టి కేంద్రం(వీసీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంటి పరీక్షలు దీన్ని ముందుగా గుర్తించలేవని, తాము అభివృద్ధి చేసిన కొత్త పరీక్షతో వైద్యులు ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి అంధత్వాన్ని నివారించవచ్చని వీరు చెప్తున్నారు. వయసు పెరుగుతున్నకొద్దీ చాలామందికి రెటీనాలో పసుపు మచ్చలు ఏర్పడతాయని, డ్రసెన్‌గా పేర్కొనే దీనివల్ల ఏఎండీ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు దృష్టికేంద్రం, ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ టెడ్‌ మేడెస్‌. ఏఎండీ ప్రాథమిక దశలో ఉన్నవారు ఎల్‌సీడీ తెరలపై దృశ్యాలను చూస్తున్నప్పుడు వారి కంటిపాపలు ఎలా స్పందిస్తున్నాయనేది వీరు రూపొందించిన నిజక్షేత్ర విశ్లేషణ పరికరంతో గుర్తించారు. ప్రస్తుతమున్న పరికరాలు కంటి ప్రధాన దృష్టి క్షేత్రాన్నే పరీక్షిస్తాయని, తాము రూపొందించిన విధానంలో మొత్తం దృష్టి తీరును పరీక్షించొచ్చని మేడిసన్‌ చెప్తున్నారు. ఏఎండీతో బాధపడే అందరూ పూర్తిగా దృష్టి కోల్పోతారని కచ్చితంగా చెప్పలేకపోయినా, ఒకవేళ అలాంటి ప్రమాదముంటే ముందుగానే గుర్తించవచ్చన్నది వీరి పరిశోధనల సారాంశం. ఈ అధ్యయన వివరాలను 'గ్రేఫ్స్‌ ఆర్కైవ్‌ ఫర్‌ క్లినికల్‌ అండ్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ ఆప్తాల్మజీ' జర్నల్‌ ప్రచురించింది.(5:46 AM 10/2/2013)
  • =========================== 
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.