20 October 2013

Fat genes change with exercise,వ్యాయామంతో 'కొవ్వు' జన్యువుల మార్పు


[Obesity+belly.jpg]
cycling as Exercise -------------------------------------------Fatty body ..genetical origin.
  •  
శరీరంలో ఎక్కువగా ఉన్న కేలరీలు ఖర్చు కావటానికి వ్యాయామాన్ని మించిన మార్గం లేదన్నది తెలిసిందే. కానీ దీని ప్రభావాలు మరింత లోతుగా.. ఆ మాటకొస్తే శరీరంలో కొవ్వు పేరుకుపోయే విధానాన్నే మార్చేస్తుందని మీకు తెలుసా? ఆరునెలల పాటు సైక్లింగ్‌ లేదా ఏరోబిక్స్‌ వంటి వ్యాయామాలు చేస్తే.. కొవ్వు పేరుకుపోవటంలో, వూబకాయం రావటంలో పాలు పంచుకునే జన్యువుల పనితీరు మారిపోయినట్టు స్వీడన్‌ పరిశోధకులు గుర్తించారు. రక్తంలోని చక్కెరను కొవ్వు కణాల్లో పోగుపడేలా చేసే జన్యువుల పని వేగాన్నీ వ్యాయామం తగ్గిస్తున్నట్టు తేలింది. నిజానికి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యువులు జీవితాంతం మారటమంటూ ఉండదు. కానీ అన్ని జన్యువులు అన్ని సమయాల్లో చురుకుగా ఉండవు. కొన్ని కణాల్లో కొన్ని జన్యువులే చురుకుగా పనిచేస్తాయి. మెథీలేషన్‌ అనే ప్రక్రియ ఇలా జన్యువులు పనిచేయటాన్ని, ఆపేయటాన్ని నియంత్రిస్తుంది. వ్యాయామం వల్ల 7వేల జన్యువులు ప్రభావితం అవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. శరీరంలో కొవ్వు పేరుకోవటానికి దోహదం చేసే జన్యువులూ ఇందులో ఉన్నాయి. వీటిల్లో రెండు కీలక జన్యువులు రక్తంలోని కొవ్వు ఆమ్లాల మోతాదులనూ తగ్గిస్తున్నట్టు తేలింది. వ్యాయామం వీటి పనితీరును మార్చటం ద్వారా శరీరంలో కొవ్వు పెరగకుండా చూస్తోందన్నమాట. రక్తంలో కొవ్వు మోతాదులు ఎక్కువుంటే మధుమేహం ముప్పు పొంచి ఉన్నట్టే. అందువల్ల వ్యాయామంతో మధుమేహం ముప్పు ఎందుకు తగ్గుతుందో అర్థం చేసుకోవటానికి ఈ అధ్యయనం తోడ్పడగలదని భావిస్తున్నారు. అలాగే ఈ జన్యువులను లక్ష్యంగా చేసుకొని పనిచేసే మందుల రూపకల్పనకూ దారితీస్తుందని ఆశిస్తున్నారు.

  • ===========================
 Visit my website at -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your Comment . Your feedback is important for improvement of this blog.